×

కొండెక్కిన కోడిగుడ్డు ధరలు.. అసలు కారణం ఇదే..!

కోడిగుడ్డు ధరలు

కొండెక్కిన కోడిగుడ్డు ధరలు.. అసలు కారణం ఇదే..!

Spread the love

తెలంగాణలో కోడిగుడ్డు ధరలకు రెక్కలు వచ్చేశాయి. రోజు రోజుకు పెరిగిపోతూ.. సామాన్యుని జేబుకు చిల్లులు పెడుతున్నాయి. మొన్నటివరకు రూ.5.50గా మాత్రమే ఉన్న గుడ్డు ధర.. ఇప్పుడు రూ.7కు చేరుకోగా.. కొన్ని చోట్ల 8 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. గుడ్డుతో పాటు చికెన్ ధరలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే.. గుడ్డు ధర ఇంతగా పెరిగిపోవటానికి చాలా కారణాలే ఉన్నాయి.

Egg prices in telangana: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకదాని రేట్లు పెరిగి కాస్త తగ్గుతున్నాయనే సమయాని మరొకటి రెడీగా ఉంటోంది. మొన్నటివరకు ఉల్లిగడ్డలు, టమాల ధరలు కొండెక్కగా.. ఆ తర్వాత చికెన్ రేట్లు అనంతరం వెల్లుల్లి.. ఇలా ఒక్కొక్కటిగా మండిపోతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక.. ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కార్తికమాసం ముగిసిన తర్వాత.. గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో.. ధర కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 మాత్రమే ఉండగా.. వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. కాగా.. ఇప్పుడు ఏకంగా రూ.7 నుంచి 8 గా పలుకుతోంది.

వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.84కు చేరుకోవటం గమనార్హం. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76 ఉండగా.. రిటైల్‌లో రూ.7గా అమ్ముతున్నారు. కొన్ని కొన్ని దుకాణాల్లో రూ.7.50, రూ.8గా కూడా అమ్ముతుండటం గమనార్హం. ప్రస్తుతం కేసు ధర రూ.180 నుంచి రూ.200 చేరడంతో రిటైల్‌ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. మరోవైపు.. చికెన్‌ ధర కూడా పెరిగిందండోయ్. కార్తిక మాసంలో కిలో చికెన్‌ రూ.170 నుంచి రూ.190 వరకు పలకగా.. తాజాగా రూ.240కి చేరటం గమనార్హం.

రాష్ట్రంలో 1,100 కోళ్ల ఫారాలున్నాయి. కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏటా 17.67 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే.. గత 20 రోజులుగా చలి విపరీతంగా పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పెంపకందారులు చెప్తున్నారు. మరోవైపు.. దాణా ఛార్జీలు పెరగడం, వాహనదారులు గత రెండు నెలల్లో రవాణా ఖర్చులు 15 శాతం పెంచడం వల్ల గుడ్ల ధర కూడా పెరిగిందని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం రూ.5 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.7,200కు చేరిందని, మొక్కజొన్న క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

హైదరాబాద్‌లో సాధారణంగా రోజుకు 80 లక్షల కోడిగుడ్లు అమ్ముడుపోతుంటాయి. అయితే.. గత నెలలో 90 లక్షలు అమ్ముడుపోగా.. వారం రోజుల నుంచి కోటి దాటటం విశేషం. మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటం కూడా కోడిగుడ్ల విక్రయాలు పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు.

Read More

DailysparkNews

Post Comment