×

తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ఆ ప్రాంతం మరింత అభివృద్ధి!

New railway

తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ఆ ప్రాంతం మరింత అభివృద్ధి!

Spread the love

సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో సరకు రవాణా వేగవంతం చేయడానికి రైల్వే శాఖ ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. అందులో భాగంగా మరో బైపాస్‌ను ప్రతిపాదించింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్‌లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్
  • ధర్మసాగర్‌ ప్రాంతంలో ఏర్పాటు
  • రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం

తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్ :

అమృత భారత్ పథకంలో భాగంగా తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లను రైల్వేశాఖ అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతోంది. కొత్త స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతంలో కొత్త రైల్వే స్షేషన్‌ ప్రతిపాదన తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ మార్గంలో గూడ్స్ రవాణాను వేగవంతం చేయడానికి రైల్వే శాఖ మరో బైపాస్‌ను ప్రతిపాదించింది. దీని ప్రకారం ధర్మసాగర్‌ మీదుగా రైలు పట్టాలు వెళ్లనున్నాయి.

కొత్తగా చేపడుతున్న బైపాస్‌ కేవలం గూడ్స్‌ రవాణాకేనని రైల్వే శాఖ చెబుతోంది. ఇవి కాజీపేట మీదుగా వెళ్లడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది. దీంతో సరకు రవాణాకు లేట్ అవుతుంది. ఇది రైల్వే శాఖకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందుకే కొత్తగా బైపాస్‌ను ప్రతిపాదించారు. కొత్త ప్రతిపాదనలో నష్కల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని అండర్‌పాస్‌ పక్కనుంచి ఈ కొత్త లైను ప్రారంభం కానుంది. పెద్దపెండ్యాల, కరుణాపురం మధ్య నుంచి నర్సింగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్‌, ఉనికిచెర్ల, మునిపల్లి, మీదుగా చింతగట్టు కెనాల్‌ పక్కనుంచి హసన్‌పర్తి రోడ్డు రైల్వే స్టేషన్‌కు కలుస్తుంది. ధర్మసాగర్‌లో కొత్త స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర, ఉత్తర భారతదేశ రాష్ట్రాల మధ్య ఎగుమతులు, దిగుమతులు వేగం చేయడానికి ఇది తోడ్పడుతుందని రైల్వే భావిస్తోంది.

గతంలో నష్కల్‌ నుంచి భూపాలపట్నం ఔటర్‌ రింగ్‌రోడ్‌ పక్కనుంచి రాంపూర్‌, మడికొండ, టేకులగూడెం మీదుగా హసన్‌పర్తి రోడ్‌కు రైల్వే బైపాస్‌ను రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదించారు. దీని కారణంగా వరంగల్‌ నగరం అభివృద్ధికి విఘాతం కలగుతుందనే ఆరోపణలు, స్థానిక రైతులు వ్యతిరేకించడంతో రైల్వే ఇంజినీరింగ్‌ విభాగం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రస్తుతం రైల్వే ప్రతిపాదించిన సర్వే పనులు పూర్తయ్యాయి. స్థానికంగా భూమి కోల్పోయే వారికి త్వరలోనే నోటీసులు ఇచ్చే పనుల్లో ఉన్నారు.

అయితే కొత్త ప్రతిపాదనను అధికారులు గోప్యంగా ఉంచారు. వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రతిపాదనే తుది నిర్ణయం కాదని.. ఇందులోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధర్మసాగర్‌లో రైల్వే స్టేషన్ ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.

Read More :

Demand for Maldives President to apologise for recent remarks targeting India

Post Comment